ఢిల్లీ కారు.. తెలంగాణ నంబర్.. ఇన్‌స్టా ఐడియాతో బుక్కైన యువ వైద్యుడు

  • లక్షల రోడ్డు ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు వైద్యుడి పన్నాగం
  • ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి ఫ్లిప్పింగ్ నంబర్ ప్లేట్ ఏర్పాటు
  • జూబ్లీహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కిన వైనం
  • నాలుగేళ్లుగా నకిలీ నంబర్‌తో హైదరాబాద్‌లో కారు నడుపుతున్నట్లు గుర్తింపు
  • వాడిన నకిలీ నంబర్ తన బాబాయ్ కారుదేనని దర్యాప్తులో వెల్లడి
లక్షల రూపాయల రోడ్డు ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ఓ యువ వైద్యుడు వేసిన వినూత్న ఎత్తుగడ పోలీసులనే ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన ఓ రీల్ స్ఫూర్తితో తన బీఎండబ్ల్యూ కారుకు నంబర్ ప్లేట్ మార్చే పరికరాన్ని అమర్చి, నాలుగేళ్లుగా అధికారుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో జరిగిన డ్రంకెన్ డ్రైవ్‌లో ఈ వ్యవహారం బట్టబయలైంది.

వివరాల్లోకి వెళితే... అశోక్‌నగర్‌కు చెందిన డాక్టర్ గౌతంరెడ్డి నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో ఒక బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు. ఆ కారును తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయిస్తే రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రోడ్డు పన్ను చెల్లించాల్సి వస్తుందని భావించాడు. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో నంబర్ ప్లేట్ మార్చే పరికరానికి సంబంధించిన రీల్ చూశాడు.

వెంటనే ఆన్‌లైన్‌లో రూ.10 వేలు పెట్టి ఆ పరికరాన్ని కొనుగోలు చేశాడు. మొదట లోహపు నంబర్ ప్లేట్‌తో ప్రయత్నించగా, మోటార్ బరువును మోయలేకపోయింది. దీంతో ఓ బ్యానర్ క్లాత్‌పై తన బాబాయ్ కారుకు చెందిన తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ప్రింట్ చేయించి, ఆ పరికరానికి అమర్చాడు. అప్పటి నుంచి ఈ ఫ్లిప్పింగ్ నంబర్ ప్లేట్‌తో నాలుగేళ్లుగా నగరంలో తిరుగుతున్నాడు.

ఈ నెల 11న జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో మద్యం తాగి కారు నడుపుతూ గౌతంరెడ్డి పట్టుబడ్డాడు. ఆ సమయంలో కారుకు ఉన్న ఈ ప్రత్యేక వ్యవస్థను గమనించిన పోలీసులు విస్తుపోయారు. వెంటనే అతడిని, కారును అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Number Plate Fraud
Gautam Reddy
BMW car
Telangana registration
Road tax evasion
Drunken driving
Jubilee Hills
Instagram reel
Flipping number plate
Car modification

More Telugu News